సదాశ్రయం
ఆదిశంకరులు అద్వైత స్థాపనాచార్యులు. వారు జగద్గురువు లైనందున వారి ఉపదేశము లొక్క హిందువులకే కాకసమస్త మానవానీకానికీ ప్రయోజనకారు లగుచున్నవి. వారు ఏ మతాన్నీ కాదనలేదు. ఏ తాత్త్విక దృష్టినీ త్రోసివేయలేదు. అద్వైతమే పరమావధి అనీ తక్కిన మతములన్నీ సోపానప్రక్రియలై అద్వైతంలో లయము చెంద గలవని వారు బోధించారు. విభిన్న తాత్త్విక మార్గాలను సమన్వయించి ఆత్మానుసంధానానికి అన్నీ సహాయకారు లనియే వారు నిరూపించారు.
అద్వైతం ఒక మతంకాదు; అదొక అనుభూతి. అన్ని మతాలలోనూ అద్వైతానుభూతిని పొందిన మహాత్ము లున్నారు. అట్టి అద్వైతసిద్ధిని పొందిన వారిలో తత్త్వరాయ స్వామి మాధ్వులు. మస్తాన్ సాహెబు ముస్లిము. అద్వైతాన్ని ప్రతిఘటించేవాళ్లుకూడ ఒక విధంగా అద్వైతాన్నే బలపరుస్తుంటారు. ఆచార్య పాదులవిశాలహృదయంలోఅన్ని మతాల వారికీ తావున్నది. ఇతర మతాలు అద్వైతాన్ని వ్యతిరేకించినా, అద్వైతానికి మాత్రం వానితో తగవులేదు.
శంకరాచార్యులవారు నిరాడంబరమైన జీవన విధానాన్ని ప్రజలు పాటించాలన్నారు. హైందవ మతంలో వివిధ అర్చామూర్తులున్నా, ఏ మూర్తినైనా ఉపాసించి తరించవచ్చు ననే వారు బోధించారు. వేదాంతపఠనము, ధ్యానము, అద్వైతానికి అంగములని వారు పేర్కొన్నారు. అద్వైతంలో దైవానికి ప్రసక్తిలేదని కొందఱు వాదిస్తుంటారు. నిజానికి అద్వైత వాసన భగవదనుగ్రహం ఉంటేకానీ కలుగదు. అందుచే అధీతి బోధాచరణలలో ఆచార్యులు భగవదుపాసన ఆవశ్యకమని చూసినారంటే ఆశ్చర్యమేమీలేదు. భగవత్సాన్నిధ్యాన్ని నిరపేక్షిస్తూ మనం గడిపే కాలమంతా వ్యర్థమే. జ్ఞానోపలబ్ధికి ఇష్టదేవతో పాసన పూర్వాంగ మన వలసి వస్తుంది. నడక నేర్చుకొనుటకు ముందు పసి పాపలకు త్రోపుడుబండి ఎట్లావశ్యకమో అట్లే ఆధ్యాత్మిక ప్రాధమికా వస్థలలో ఉపాసనకూడ ఆవశ్యకమే. కామ్యార్థసిద్ధికై భగవంతుని మనం ప్రార్థించవచ్చు. కానీ ఉత్తమ ప్రార్థన 'సర్వే జనా స్సుఖినో భవంతు' అనడమే. భగవద్భక్తుడు ఈ వ్యస్తోపాధియుత సమస్త ప్రపంచంలోనూ ఏకత్వ దర్శనం చేయడానికి అలవాటు పడాలి.
మనం నియత జీవనం చేయాలని వేదం తెలుపుతున్నది. వేదోక్త మార్గములు, కర్మానుష్ఠానము, శీలము, ఉపాసన, జ్ఞానము- ఇత్యాదులు మానవజన్మ ఎత్తినందులకు, పశువుల వలె కాలమంతా ఆహార నిద్రాభయ మైథునాలకే వెచ్చిస్తే' భగవంతుడు మనకిచ్చిన సదవకాశాన్ని వ్యర్థం చేసుకొన్న వాళ్ళమవుతాం. పాశవిక ప్రవృత్తలను నియమించి మనోనైర్మల్యం సాధించి, సత్కర్మాచరణ మూలంగా లభించే అర్ధాన్ని పుణ్యంక్రిందికి మనం మార్చుకోవాలి. పరలోకంలోచెలామణి అయ్యే ద్రవ్యం పుణ్యమే సంపాదించడం. నిలువ చేసుకోవడం ఇపే మనిషికి ధ్యేయం కారాదు. వృత్తియే ప్రాధాన్యంగా గల విద్య విద్య కాదు. ధర్మాభిరుచి కలిగించే విద్యయే విద్య. జీవనవిధానంలో ఆర్థికావసరాలను మనం వృద్ధి చేసుకొంటూ పోరాదు. జీవనప్రమాణంలో వృద్ధిఉండాలి. కానీ జీవనపరిమాణంలో కాదు. ఆధ్యాత్మికాభి వృద్ధికి స్వప్రయత్నంతోపాటు భగవదనుగ్రహమూ కలసి రావాలి. దానికై అనుదినమూ ధ్యానగంగలో మునకలువేస్తే కానీ కల్మష క్షాళనమునకువీలుండదు. ఇట్లు రోజూ ధ్యానాం భస్సులో తేలిన మనస్సు నిత్యానిత్య వస్తువివేక సమర్థమై జ్ఞానాదర్శనం చేయ కలుగుతుంది.
జీవితవృక్షానికి ఫలం జ్ఞానమే. మనకు ఆదర్శపురుషులు సంయమవంతులు, జ్ఞానులు. వారికి రాగద్వేషములు లేవు. వారు తుల్య నిందాస్తుతులు. కష్టములు వచ్చినపుడు ధృతితో వుత్సాహంతో ఎదుర్కొంటారేకాని, కష్టభారంతో చింతా సముద్రంలో వాళ్ళు మునిగిపోరు. ఒక పెద్ద దుంగనునీళ్ళలో పడవేస్తే అది మునగదు తేలుతుంది. అట్లాగే వీరు సంసార సముద్రంలో మునగరు. ఎందుకంటే జ్ఞానులకు పరమసత్యం పరమాత్మయే. దసరాలలో బొమ్మకొలువులు పెట్టుకొంటారు. ఆ బొమ్మలన్నీ మట్టిబొమ్మలేకదా? అట్లేజ్ఞానిదృష్టికి సర్వమూ పరమాత్మ స్వరూపమే. జ్ఞాని బంధరహితుడు. అందుచేత అతనిని సంసార మంటదు. మోక్ష మంటే పారలౌకికంకాదు. మోక్షం అంటే స్వస్వరూపస్థితియే. అన్ని కాలములలోనూ స్వస్వరూపస్థితిలో ఉండే జ్ఞానికి వేరు చింతలు ఏముంటాయి? 'త్ర్యంబకం యజామహే' అన్న మంత్రంలో 'ఉర్వారుకమిన' అన్న పదప్రయోగం ఈ మోక్షాన్నే సూచిస్తుంది. పండిన దోసకాయ తోడిమ నుంచీ సులభంగా రాలిపోతుంది. రాలి పోయిన విషయం కూడా తెలియనట్లు తీగ ప్రక్కపడివుంటుంది. అట్టి సులభ##మైన ముక్తియే మనకు ధ్యేయం కావాలి. అట్టి మోక్షమును అనుభవంలో తెచ్చుకొన్నవారే జ్ఞానులు అట్టి జ్ఞానులు అన్ని కాలాలలోనూ ఉంటున్నారు. వారి ఉనికియే జగత్తుకు మంగళం. మహాపురుషుని సంశ్రయంతో వేలకొలది జనులు వాళ్ళకు తెలియకుండానేఆత్మలాభం అందుకొంటారు. ఊహాతీత శాంతియే వాళ్లు మనకిచ్చే ప్రసాదం. 'చిత్తప్రసాద ఏవ ప్రసాదః' ఈ అనిత్య జగత్తును అధిగమించడానికీ, మాయ నుండి తప్పించుకోవడానికే మనం అట్టి జ్ఞానులను ఆశ్రయించాలి. అదే సదాశ్రయం.
|